Devakka: జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దేవక్క.. నెల్లూరు ఎస్పీ ఎదుట లొంగుబాటు

Woman Maoist Devakka Surrendered before Nellore SP

  • దేవక్క తలపై రూ. 4 లక్షల రివార్డు, పది క్రిమినల్ కేసులు
  • 1984లో భర్తతో కలిసి అజ్ఞాతంలోకి
  • 1987లో అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు
  • ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసి దేవక్కను విడిపించుకున్న నక్సల్స్

తన తలపై రూ. 4 లక్షల రివార్డు, 10 క్రిమినల్ కేసులు ఉన్న మావోయిస్టు రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాస్ లక్ష్మి (59) నిన్న నెల్లూరు ఎస్పీ విజయరావు ఎదుట లొంగిపోయారు. ఆమె తలపై రూ. 4 లక్షల రివార్డుతోపాటు పది కేసులు కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. 

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడికొండ ప్రాంతానికి చెందిన దేవక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎల్లవరం దళంలో ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. సీపీఐఎంఎల్, పీడబ్ల్యూజీ (మావోయిస్టు), తూర్పు డీవీసీ తదితర దళాల్లో పనిచేశారు. 1974లో నెల్లూరు జిల్లా కావలి మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన రామోజు నరేంద్ర అలియాస్ సుబ్బన్నను వివాహం చేసుకున్నారు. 

మావోయిస్టు సమావేశాలకు, ఆర్థిక అవసరాలకు, వైద్య అవసరాలకు దేవక్క తోడ్పాటు అందించారు. 1984లో భర్తతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న దేవక్కతోపాటు మరో ఐదుగురిని 1987లో అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు జైలుకు తరలించారు. ఆ తర్వాత 12 రోజులకు 8 మంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసిన నక్సల్స్.. అరెస్ట్ అయిన దేవక్కతోపాటు మిగిలిన ఐదుగురిని విడిపించుకున్నారు. 2018లో దేవక్క భర్త మరణించారు. కాగా, ఆమె తలపై ఉన్న రూ. 4 లక్షల రివార్డును ఆమెకే అందించడంతోపాటు చట్టప్రకారం ఇతర సౌకర్యాలను కల్పిస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు.

  • Loading...

More Telugu News