eating almonds: రోజుకు ఎన్ని బాదం గింజలు తినచ్చో తెలుసా..?
- రోజులో కనీసం 20 బాదం గింజలు తినాలి
- వీటితో ఎన్నో రకాల పోషకాలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు
- గుండె ఆరోగ్యానికి వీటితో ఎంతో మంచి
బాదం (ఆల్మండ్స్) లో ఎన్నో పోషకాలు ఉంటాయని తెలుసు. దీనిపై అవగాహన పెరగడంతో నేడు చాలా మంది బాదం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీదైనవే అయినా, ఆరోగ్యం కోసం నట్స్ పై ఖర్చు చేసే ధోరణి పెరుగుతోంది. మరి రోజులో ఎన్ని బాదం గింజలు తినాలి? ఇది చాలా మందికి సమాధానం లేని ప్రశ్న. దీనికి సమాధానం కనుగొనేందుకు ఓ అధ్యయనం జరిగింది. దీనికి లండన్ లోని కింగ్స్ కాలేజ్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ డాక్టర్ అలైస్ క్రీడన్ మార్గదర్శిగా వ్యవహరించారు. అధ్యయన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమయ్యాయి.
‘‘బుటీరేట్ ఆమ్లం పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్ద పేగులో కణాలకు ఇది ఇంధనంగా పనిచేస్తుంది. దీంతో పెద్ద పేగులో కార్యకలాపాలు చక్కగా సాగేందుకు సాయపడుతుంది. పోషకాలను సంగ్రహించాలంటూ పేగులకు సంకేతాలు కూడా పంపిస్తుంది. పేగుల్లో ఉత్పత్తి అయిన బుటీరేట్ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాలేయం, మస్తిష్కం, ఊపిరితిత్తుల్లోనూ ఆరోగ్యవంతమైన కార్యకలాపాలకు సాయపడుతుంది’’ అని క్రీడన్ వివరించారు. బుటీరేట్ ను పెంచే గుణం బాదానికి ఉంది. అందుకే రోజుకు ఎన్ని గ్రాముల బాదం అవసరం, అసలు బుటీరేట్ చేసే మంచి ఏంటన్న దానిపై ఈ అధ్యయనం దృష్టి పెట్టింది. రోజువారీ 56 గ్రాముల బాదం గింజలు (అంటే సుమారు 46 గింజలు) తినడం వల్ల బుటీరేట్ పెరుగుతున్నట్టు గుర్తించారు.
మనకు ఎంత అవసరం?
ఈ అధ్యయన ఫలితాలపై నానావతి ఆసుపత్రి న్యూట్రిషన్ విభాగం హెడ్ ఉషాకిరణ్ సిసోడియా స్పందించారు. ‘‘బాదంలో బి కాంప్లెక్స్ విటమిన్లు అయిన బీ1, బీ3, ఫొలేట్, బీ9, మంచి కొవ్వులు, మినరల్స్ ఉంటాయి. ఒక ఔన్స్ బాదం గింజలు (సుమారు 23 బాదం గింజలు) తినడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ప్లాంట్ ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం తగినంత బాదం ద్వారా లభిస్తాయి’’ అని వివరించారు. బాదంతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని, రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుందని, కొన్ని రకాల కేన్సర్ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. స్నాక్స్ కు బదులు కనీసం 20 బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు.