Munugode: మునుగోడులో ప్రారంభమైన పోలింగ్.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
- రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నిక
- ఓటు వేయనున్న 2,41,855 మంది ఓటర్లు
- సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాలకు చెందిన 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వీరిలో 50 మంది సర్వీస్ ఓటర్లు కాగా, 80 ఏళ్లు దాటిన వారు 2,576 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉండగా, 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 105 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.