North Korea: ఈ రోజు కూడా క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా.. జపాన్, దక్షిణ కొరియా ఆగ్రహం
- నిన్న 20కి పైగా క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
- జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్రయోగం
- మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించిన దక్షిణ కొరియా
ఉత్తరకొరియా ఈ ఉదయం ఒక లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని, రెండు షార్ట్ రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ఉదయం 7.48 గంటలకు జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. దీనిపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు మియాగి, యమగటీ, నీగాటా ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లలోనే ఉండాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన అరగంట తర్వాత అది జపాన్ భూభాగాన్ని దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిందని జపాన్ ప్రభుత్వం, జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపాయి.
జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత... 8.39 గంటల సమయంలో రెండు షార్ట్ రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. మరోపక్క, ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై దక్షిణకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఉత్తర కొరియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
ఇంకోవైపు నిన్న ఉత్తరకొరియా 20కి పైగా మిస్సైళ్లను ప్రయోగించింది. ఇందులో ఒక మిస్సైల్ దక్షిణకొరియా సముద్రజలాల్లో పడింది. ఇదిలావుంచితే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దక్షిణ కొరియా సన్నద్ధంగా ఉంది. దక్షిణ కొరియాకు అమెరికా అండగా ఉంది.