Munugode: మునుగోడులో ఊపందుకున్న పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

munugodu by elections poling continues
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం ఓటింగ్ నమోదు
  • ఓటు హక్కు వినియోగించుకున్న రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, ప్రభాకర్ రెడ్డి
  • పోలింగ్ రోజూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక చివరి దశకు వచ్చేసింది. ఉప ఎన్నికకు పోలింగ్ ఈ రోజు కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఆరంభంలో పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వాటిని సరిచేశారు. ఈ క్రమంలో గంట గంటకూ పోలింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. 

ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎక్కువగా మహిళలు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో సెటిలైన మునుగోడు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేందుకు నియోజకవర్గానికి చేరుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ ఓటు హక్కు వినయోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో మనుగోడు నియోజకవర్గంలో 91 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. 

మరోవైపు పోలింగ్ రోజు కూడా వివిధ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులు నియోజక వర్గంలో తిష్ట వేసి డబ్బులు పంచుతున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. మునుగోడులో గుర్తించిన 60 మందికిపైగా స్థానికేతరులను బయటకు పంపించినట్టు తెలిపారు.
Munugode
by elections
voting

More Telugu News