Imran Khan: ఇమ్రాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు... అందుకే చంపాలని భావించానన్న దుండగుడు!

Imran Khan attacker was shot dead
  • పాక్ లో ముందస్తు ఎన్నికలు కోరుతున్న ఇమ్రాన్ ఖాన్
  • లాంగ్ మార్చ్ ర్యాలీ చేపట్టిన వైనం
  • వజీరాబాద్ వద్ద ఇమ్రాన్ పై కాల్పులు
  • దాడిని ఖండించిన పాక్ ప్రధాని
  • పాక్ రాజకీయాల్లో హింసకు తావులేదని వెల్లడి
  • ఆచితూచి స్పందించిన భారత్
పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్ తో పీటీఐ పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ ర్యాలీ చేపట్టగా, ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ర్యాలీ వజీరాబాద్ చేరుకున్న సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ కు గాయాలయ్యాయి. 

కాగా, ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన వ్యక్తి మాట్లాడుతున్న ఓ వీడియో బయటికి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, అందుకే కాల్పులు జరిపానని వెల్లడించాడు. ఇప్పుడు లాంగ్ మార్చ్ ర్యాలీ నిర్వహించడం కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడంలో భాగంగానే నిర్వహిస్తున్నాడని ఆరోపించాడు. ఇమ్రాన్ ఖాన్ ను మాత్రమే చంపాలని భావించానని, ఇంకెవరినీ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశాడు. 

కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పీటీఐ వర్గాలు తెలిపాయి.

దాడి అనంతరం ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా స్పందించారు. అల్లా తనకు పునర్జన్మను ప్రసాదించాడని దేవుడ్ని కీర్తించారు. భగవంతుడి కృపతో తాను పోరాటానికి పునరంకితం అవుతానని ఇమ్రాన్ ఉద్ఘాటించారు. 

కాగా, విపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ పై జరిగిన దాడిని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. పాక్ రాజకీయాల్లో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించాలని హోంమంత్రిని ఆదేశించినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో గాయడిన ఇమ్రాన్ ఖాన్ తదితరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

అటు, ఇమ్రాన్ పై కాల్పుల ఘటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్జి ఓ ప్రకటన చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగినట్టు తమకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. కాల్పుల అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై తమ వద్ద తగిన వివరాలు అందుబాటులో లేవని తెలిపారు.
Imran Khan
Firing
Long March Rally
Pakistan

More Telugu News