Bangladesh: ఇక్కడితో వదిలేయం: ఫేక్ ఫీల్డింగ్ వివాదంపై బంగ్లాదేశ్
- విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆరోపణలు
- అదనంగా రావాల్సిన ఐదు పరుగులు కోల్పోయామన్న నూరుల్ అహ్మద్
- ఫేక్ ఫీల్డింగ్ విషయాన్ని సరైన వేదికపైకి తీసుకెళ్తామన్న బీసీబీ అధికారి జలాల్ యూనస్
- వర్షం తర్వాత మ్యాచ్‌ను త్వరగా ప్రారంభించారన్న యూనస్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫేక్ ఫీల్డింగ్ వివాదం మరింత ముదురుతోంది. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకు అదనంగా రావాల్సిన ఐదు పరుగులు కోల్పోయామని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ అహ్మద్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేయబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. ఫేక్ ఫీల్డింగ్ విషయాన్ని కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడని, అయినా వారు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై తప్పకుండా మాట్లాడతామని అన్నారు.
ఫేక్ ఫీల్డింగ్‌ను టీవీలో అందరూ చూశారని, అంపైర్ల దృష్టికి కెప్టెన్ తీసుకెళ్తే తాను చూడలేదని అన్నారని పేర్కొన్నారు. దీంతో రివ్యూ కూడా తీసుకోలేదన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అంపైర్ ఎరాస్మత్‌తో కెప్టెన్ షకీబల్ చాలాసేపు చర్చించాడన్నారు. అంతేకాదు, వర్షం పడి ఆగిన తర్వాత ఆటను త్వరగా ప్రారంభించడంపైనా అంపైర్‌తో షకీబల్ హసన్ మాట్లాడినట్టు జలాల్ పేర్కొన్నారు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉందని, కాసేపు ఆగాలని కోరినా వినలేదని, దీంతో మ్యాచ్ ఆడక తప్పలేదన్నారు. అక్కడ వాదనకు ఆస్కారం లేదు కాబట్టి అంపైరింగ్ అంశాలను సరైన వేదికపైకి తీసుకెళ్తామని జలాల్ స్పష్టం చేశారు.