T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో తొలి హ్యాట్రిక్.. ఐర్లాండ్ బౌలర్ రికార్డు
- న్యూజిలాండ్ పై ఈ ఘనత సాధించిన జోష్ లిటిల్
- ఐర్లాండ్ 186 పరుగుల లక్ష్యం నిర్దేశించిన కివీస్
- చెలరేగిన కేన్ విలియమ్సన్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. సూపర్ 12లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న గ్రూప్1 మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ హ్యాట్రిక్ సాధించాడు. 19వ ఓవర్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్ లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. అయినా న్యూజిలాండ్ ఐర్లాండ్ కు 186 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61) మెరుపు అర్ధ శతకంతో చెలరేగాడు.
ఓపెనర్లు ఫిన్ అలెన్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 32), డెవాన్ కాన్వే (28) సత్తా చాటారు. గ్లెన్ ఫిలిఫ్స్ (17) త్వరగానే పెవిలియన్ చేరినా.. మిడిలార్డర్ లో డారిల్ మిచెల్ (31 నాటౌట్) సత్తా చాటాడు. ఓ దశలో న్యూజిలాండ్ సులువుగా 200 స్కోరు చేసేలా కనిపించింది. చివర్లో ఐర్లాండ్ బౌలర్లు పుంజుకున్నారు. జోష్ లిటిల్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్ (0), మిచెల్ శాంట్నర్ (0) వికెట్లు తీసి కివీస్ జోరుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. గారెత్ డెలానీ రెండు, మార్క్ అడైర్ ఒక వికెట్ పడగొట్టారు. గ్రూప్1 లో న్యూజిలాండ్ ప్రస్తుతం 5 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీఫైనల్ చేరుకుంటుంది.