back pain: నడుము - వెన్ను నొప్పి వేధిస్తుంటే.. ఇవి ట్రై చేయండి!
- కదలకుండా గంటల తరబడి పనిచేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు
- వెన్నెముక, కండరాలపై ఒత్తిడి పెరిగిపోతుంది
- దీర్ఘకాలిక సమస్యగా మారకముందే జాగ్రత్త పడితే మంచిది
నడుము నొప్పి.. నేడు చాలా మంది ఈ సమస్య చెప్పడం వినే ఉంటారు. 30-40 ఏళ్ల వయసు వారి నుంచి కూడా ఇది వినిపిస్తుంటుంది. గంటల పాటు కూర్చుని పనిచేసే ఉద్యోగాలే నేడు ఎక్కువ. శరీరానికి పెద్దగా పని లేకుండా మెషినరీ సాయంతో సౌకర్యంగా జీవితాన్ని సాగిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సిందే..? అన్నట్టు సౌకర్యం కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం సరికాదు.
కూర్చున్నప్పుడు భంగిమ సరిగ్గా లేకపోతే వెన్నుపాములోని డిస్క్ లపై ఒత్తిడి పడి దెబ్బతింటాయి. కనుక ఆకృతి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. భంగిమ సరిగ్గా లేకపోతే మెడపైనా ఒత్తిడి పడుతుందని తెలుసుకోవాలి. జియో రాక ముందు.. వచ్చిన తర్వాత అని ఆరోగ్యం విషయంలోనూ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే జియో వచ్చిన తర్వాతే స్మార్ట్ ఫోన్లలో నెట్ వినియోగం పెరిగింది. అప్పటి వరకు అదే పనిగా గంటల తరబడి ఫోన్లను చూసేవారు అసలు కనిపించే వారే కాదు. జియో తెచ్చిన ఉచిత, చౌక డేటా ఫలితంగా స్మార్ట్ ఫోన్ వినియోగం కొత్త శిఖరాలకు చేరింది. ఫోన్ చూసే సమయంలో తలను ముందుకు వంచి అదే పనిగా ఎక్కువ సమయం పాటు ఉండిపోతున్నారు. ఇది వెన్నెముక దెబ్బతినడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ను కంటికి సమాంతర ఎత్తులో ఉంచి చూసుకోవాలి. ఫోన్ చూసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తల బెండ్ కాకూడదు.
ఇక ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చుండిపోవడం కాకుండా మధ్యలో విరామం ఇవ్వడం అవసరం. అది ఆఫీసులో అయినా ఇంట్లో అయినా కానీ, కనీసం అరగంటకు ఒకసారి 1-2 నిమిషాలు కదలిక ఉండేలా చూసుకోవాలి. లేదంటే గంటకు 3-4 నిమిషాలు నడిచినా మంచి ఫలితం కనిపిస్తుంది. వెన్నెముక, కండరాలపై అప్పటి వరకు పడిన ఒత్తిడి తొలగిపోతుంది.
వెన్నెముక బలోపేతానికి వ్యాయామాలు ఉన్నాయి. యూట్యూబ్ లో చూసి తెలుసుకోవచ్చు. యోగాసనాలు మంచి ఆప్షన్. వేగంగా నడవడం కూడా చేయవచ్చు. దీనివల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది. వ్యాయామాలతో రక్తంలోని ఆక్సిజన్, పోషకాలు కండరాల్లో నూతనోత్తేజాన్ని తీసుకొస్తాయి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది.
కొవ్వులతో కూడిన ఆహారం తగ్గించుకోవాలి. నీరు అధికంగా తీసుకోవాలి. క్యాల్షియం, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారానికి చోటు కల్పించాలి.