Australia: ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమి తప్పించుకున్న ఆసీస్... గెలిచినా నిరాశే!
- అడిలైడ్ లో మ్యాచ్
- చివరి వరకు పోరాడిన ఆఫ్ఘన్
- 4 పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్
- పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి కంగారూలు
- మెరుగుపడని రన్ రేట్
- రేపు ఇంగ్లండ్ గెలిస్తే ఆసీస్ ఆశలు గల్లంతు
సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరేందుకు పోరాడుతున్న ఆస్ట్రేలియా నేడు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో కొద్దిలో ఓటమి తప్పించుకుంది. తుదకంటా పోరాడిన ఆఫ్ఘనిస్థాన్ పై 4 పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.
169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్ దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్లో ఆఫ్ఘన్ విజయానికి 6 బంతుల్లో 22 పరుగులు అవసరం కాగా, రషీద్ ఖాన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే, ఆ ఓవర్లో రెండు డాట్ బాల్స్ పడడంతో ఆఫ్ఘన్ కు ప్రతికూలంగా మారింది. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 23 బంతుల్లోనే 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రషీద్ స్కోరులో 3 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి.
అంతకుముందు, ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 30, గుల్బదిన్ నాయబ్ 39, ఇబ్రహీం జాద్రాన్ 26 పరుగులు చేశారు. ఉస్మాన్ ఘనీ (2), కెప్టెన్ మహ్మద్ నబీ (1) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 2, ఆడమ్ జంపా 2, కేన్ రిచర్డ్సన్ 1 వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నెగ్గినప్పటికీ, ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. భారీ తేడాతో నెగ్గి రన్ రేట్ పెంచుకోవాలని భావించినా, ఆఫ్ఘన్ జట్టు పోరాడడంతో రన్ రేట్ ఇంకా మైనస్ లోనే ఉంది. పాయింట్ల పరంగా ఇప్పుడు ఆసీస్ గ్రూప్-1లో రెండోస్థానానికి చేరింది. ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ఆసీస్ రన్ రేట్ -0.173 కాగా, ఆసీస్ తర్వాత మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ (0.547) రన్ రేట్ అంతకంటే మెరుగ్గా ఉంది. రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే ఆసీస్ సెమీస్ చాన్సులు గల్లంతవుతాయి.