South Korea: 180 యుద్ధ విమానాలతో కలకలం రేపిన ఉత్తర కొరియా... స్టెల్త్ ఫైటర్ జెట్లను రంగంలోకి దింపిన దక్షిణ కొరియా
- సంయుక్త విన్యాసాలు చేపడుతున్న అమెరికా, దక్షిణకొరియా
- భగ్గుమంటున్న ఉత్తర కొరియా
- గత కొన్నిరోజులుగా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
- తాజాగా యుద్ధ విమానాలతో కవ్వింపు చర్యలు
అమెరికా వాయుసేనతో కలిసి దక్షిణ కొరియా వాయుసేన విజిలెంట్ స్టార్మ్ పేరిట భారీ వైమానిక విన్యాసాలు చేపట్టడం పట్ల ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ విన్యాసాలు తమ దేశంపై దాడికి సన్నాహాలు అని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
ఈ క్రమంలో నేడు ఉత్తర కొరియా 180 యుద్ధ విమానాలతో దక్షిణ కొరియా సరిహద్దుల్లో కలకలం రేపింది. అయితే, దక్షిణ కొరియా వెంటనే స్పందించి, భారీ ఎత్తున ఫైటర్ జెట్లను రంగంలోకి దింపింది.
ఇవాళ సరిహద్దుల్లో ఉత్తర కొరియాకు చెందిన వందలాది విమానాలను గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఇవి ప్యాంగ్యాంగ్ వైమానిక స్థావరం నుంచి గాల్లోకి లేచినట్టు తెలిపింది. దాంతో తాము 80 యుద్ధ విమానాలను మోహరించామని, వాటిలో అత్యాధునిక ఎఫ్-35ఏ స్టెల్త్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఉత్తర కొరియా యుద్ధ విమానాలు వ్యూహాత్మక విభజన రేఖ వద్ద 20 కిలోమీటర్ల మేర ముందుకు వచ్చాయని వివరించారు.
కాగా, యుద్ధ విమానాలతో సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడడం ఉత్తర కొరియాకు ఇదే ప్రథమం కాదు. గత నెలలోనూ ఆ దేశం 10 విమానాలతో సరిహద్దుల వద్ద విన్యాసాలు చేపట్టి దక్షిణ కొరియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.