Netflix: నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్లు మనకు కాదు..!
- ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్లు ఆవిష్కరణ
- అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లో మొదలు
- భారత్ లో మాత్రం ఈ అవకాశం లేనట్టే
- గంటలో ఐదు నిమిషాల మేర వాణిజ్య ప్రకటనలు
వాణిజ్య ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్లను నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో నెల రోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, స్పెయిన్, యూకే, యూఎస్ లో ఈ ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆశ్చర్యంగా భారత్ లో మాత్రం ఈ ప్లాన్లకు చోటు కల్పించలేదు. ఎందుకంటే ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ లో ప్లాన్లు చౌకగానే ఉన్నాయన్నది నెట్ ఫ్లిక్స్ ఉద్దేశ్యం. మన దేశంలో మొబైల్ ప్లాన్ రూ.179 (నెలకు) మొదలవుతోంది.
బేసిక్ విత్ అడ్వర్ట్స్ ప్లాన్ లో వీక్షకులు తమకు నచ్చిన కంటెంట్ ను వీక్షించొచ్చు. కాకపోతే షోల మధ్యలో ప్రకటనలు వస్తుంటాయి. వాటిని కూడా చూడాల్సిందే. గంటలో 4-5 నిమిషాల పాటు ప్రకటనలు ఉంటాయి. అలాగే, ఈ చౌక ప్లాన్లలో వీడియోల రిజల్యూషన్ 720 పిక్సల్స్ హెచ్ డీ క్వాలిటీతో ఉంటుంది. రేట్లు తక్కువ ఉన్నాయి కదా అని, ఇతర ప్లాన్లతో పోలిస్తే వీటిల్లో ఫీచర్లు తక్కువ ఉంటాయని అనుకోవద్దు. కేవలం ప్రకటనలు చూడడం ద్వారా తక్కువ చెల్లించే సదుపాయాన్ని నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చింది. ప్రకటనలతో కంపెనీకి ఆదాయం వస్తుంది కనుక తక్కువ చార్జీ వసూలు చేస్తోంది.