Alapati Rajendra Prasad: జగన్ రెడ్డి అండ్ కో పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తినేస్తున్నారు: ఆలపాటి రాజేంద్రప్రసాద్

Alapati Rajendra Prasad fires on Jagan and YCP leaders
  • పేదల నవనాడుల్ని పిండేస్తున్నారని విమర్శలు
  • రూ.7 వేల కోట్ల బియ్యం బొక్కేశారని వ్యాఖ్యలు
  • రేషన్ వ్యవస్థను నాశనం చేశారని వెల్లడి
పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తినేస్తున్న జగన్ రెడ్డి అండ్ కో నవరత్నాల పేరుతో పేదవాడి నవనాడుల్నీ పిండేస్తూ జేబులు నింపుకుంటున్నారని టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రూ.7వేల కోట్ల బియ్యం తినేశారని, ఇంటింటికీ రేషన్ వాహనాలతో... పేదవాడి బియ్యాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. 5.66 లక్షల టన్నుల బియ్యానికి లెక్కల్లేవని కేంద్ర మంత్రి చెప్పినా సిగ్గులేదా? అంటూ ఆలపాటి నిలదీశారు. 

"ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదనే మహోన్నత లక్ష్యంతో రేషన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటైంది. అన్న నందమూరి తారకరామారావు దేశంలోనే తొలిసారిగా రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల ఆకలి తీర్చేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అలాంటి మహత్తరమైన పథకాన్ని నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. 

టీడీపీ హయాంలో రాష్ట్రంలో 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డులుంటే... వాటిని 1.44 కోట్లకు కుదించారు. సుమారు 30 వేల రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ జరిగేది. ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేకుండా రేషన్ డీలర్లు సరుకుల్ని పంపిణీ చేస్తే... ఇంటింటికీ రేషన్ పేరుతో జగన్ రెడ్డి ఆ వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టుపట్టించారు. 

మూడేళ్ల క్రితం వరకు 95 శాతం వరకు రేషన్ తీసుకుంటే... దాన్ని 80 శాతం మించకుండా జగన్ రెడ్డి నాశనం చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థపై జగన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీంతోనే అర్ధమైంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.2వేల కోట్ల విలువైన సుమారు 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టాయని కేంద్ర మంత్రి పార్లమెంటులోనే చెప్పారు. ఇప్పటి వరకు మట్టి, ఇసుక, మద్యం మాఫియాలతో ప్రజల్ని దోచుకుతిన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రజల ఆకలి తీర్చే బియ్యాన్నీ అడ్డగోలుగా బొక్కేస్తున్నారు" అంటూ ఆలపాటి విమర్శనాస్త్రాలు సంధించారు.
Alapati Rajendra Prasad
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News