YS Vivekananda Reddy: ప్రతిపక్షానికి వై నాట్ 175 అనిపిస్తోంది: ఎంపీ రఘురామకృష్ణరాజు
- నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో జన ప్రభంజనం కనిపించిందన్న వైసీపీ రెబల్ ఎంపీ
- ఈ ప్రభంజనం చూస్తుంటే.. తన పార్టీ భవిష్యత్తు ఏమిటో కనిపించిందని వ్యాఖ్య
- అందరూ మనలాగే కోడి కత్తి డ్రామాలు వేసేస్తారా? అని సెటైర్లు
- అక్రమ అరెస్ట్ లు ఇంకెన్నాళ్లని ప్రశ్నించిన నరసాపురం ఎంపీ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షోపై నందిగామలో జరిగిన దాడి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందంటూ వచ్చిన వార్తలపై వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శనివారం తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో జన ప్రభంజనం కనిపించిందని ఆయన అన్నారు. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే... ప్రతిపక్షానికి వై నాట్ 175 అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ వారు మాత్రం వై నాట్ 175 అని చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు రోడ్ షోలో కనిపించిన జన ప్రభంజనం చూస్తుంటే... తనకు తన పార్టీ భవిష్యత్తు ముఖ చిత్రం కనిపించిందని కూడా ఆయన అన్నారు.
ఏపీ మంత్రి జోగి రమేశ్ దిగజారి మాట్లాడుతున్నారని కూడా రఘురామరాజు విమర్శించారు. అయినా దాడి అయినా, రెక్కీ అయినా ఎవరైనా తమపై తాము చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. అందరూ తమ పార్టీ మాదిరే కోడి కత్తి డ్రామాలు వేసేస్తారా? అని కూడా ఆయన సెటైర్లు సంధించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమ పార్టీ వారు పథకం ప్రకారం అరెస్ట్ చేస్తారన్నారు. ఈ తరహా అక్రమ అరెస్టులు ఇంకెన్నాళ్లని ఆయన ప్రశ్నించారు.