Odisha: ఒడిశాలో 400 మంది మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
- అల్లూరి సీతారామరాజు, మల్కనగిరి జిల్లాలోని పలు గ్రామాలకు చెందినవారు లొంగుబాటు
- ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చూశాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న మావోయిస్టు సానుభూతిపరులు
- నక్సల్స్‌ను తమ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకుంటామని ప్రతిజ్ఞ
ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో 400 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వారందరూ జిల్లాలోని ధూలిపుట్, పాపరమెట్ల పంచాయతీలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇంజర్, జాముగూడ, బైతల్ పంచాయతీలకు చెందినవారు. మల్కనగిరి జిల్లాలోని జంతాపాయి గ్రామంలో కోరాపుట్ డీఐజీ రాజేశ్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ శైలేంద్రకుమార్ సింగ్, ఎస్పీ నితీశ్ వాద్వానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంలో వీరంతా జనజీవన స్రవంతిలో చేరారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూశాకే తాము లొంగిపోయినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులకు పోలీసు ఉన్నతాధికారులు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సౌత్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీ రాజేశ్ పండిట్ మాట్లాడుతూ.. మావోయిస్టులను తమ ప్రాంతంలోకి ప్రవేశించనివ్వబోమని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పారు. రెబల్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరులో పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.