Rahul Gandhi: తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది: రాహుల్ గాంధీ
- కేసీఆర్ రైతుల గొంతు నొక్కుతున్నారని రాహుల్ విమర్శ
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్న రాహుల్
- నిరుద్యోగ సమస్య దారుణంగా పెరిగిపోయిందని ఆవేదన
తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములు లాక్కుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకు రావాలనుకున్న రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మెదక్ జిల్లా పెద్దాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగులో మాట్లాడుతూ ఆయనీ విమర్శలు చేశారు. రైతులు, కూలీలు, యువకులు తమ సమస్యలను చెప్పుకుంటున్నారని, తనను కలిసిన ప్రతి యువకుడు నిరుద్యోగం గురించే చెబుతున్నాడని అన్నారు. ఉద్యోగ కల్పనా సంస్థలపై మోదీ, కేసీఆర్ దాడి చేస్తున్నారని అన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. దేశంలో ఇప్పుడు ఉన్నంతగా గతంలో ఎప్పుడూ నిరుద్యోగ సమస్య లేదని రాహుల్ పేర్కొన్నారు. 2014 తర్వాత కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ వచ్చాక నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ కార్పొరేట్ సంస్థలకు అమ్మేశారని, గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100, పెట్రోలు ధర రూ. 100 దాటినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్న తనకు ప్రజల ప్రేమ, ఆప్యాయత కారణంగా పాదయాత్రలో అలసట రావడం లేదని రాహుల్ పేర్కొన్నారు.