Telangana: బీజేపీ కోటలో టీఆర్ఎస్ కు ఆధిక్యం... 4వ రౌండ్ ముగిసేసరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
- ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఓట్ల లెక్కింపు
- తొలుత చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు
- 4 రౌండ్లలో పూర్తి అయిన చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు
- ఓవరాల్ గా బీజేపీపై 714 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబచరిన టీఆర్ఎస్...ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్... బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 2,3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రాగా.... నాలుగో రౌండ్ ముగిసేసరికి తిరిగి టీఆర్ఎస్ పుంజుకుంది. వెరసి బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ లో టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యత సాధించింది..
మునుగోడు ఓట్ల లెక్కింపులో తొలుత చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా... టీఆర్ఎస్ కు 714 ఓట్ల ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్.. ఆ వెంటనే 2, 3 రౌండ్లలో వెనుకడిపోయింది. అయితే నాలుగో రౌండ్ తో చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి బీజేపీని వెనక్కు నెట్టేసి తిరిగి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. నాలుగో రౌండ్ లో ఏకంగా 1,034 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్... ఓవరాల్ గా బీజేపీపై 714 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రౌండ్ లెక్కింపుతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపును పూర్తి చేసిన అధికారులు... ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.