Telangana: రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకు?... సీఈఓను నిలదీసిన కిషన్ రెడ్డి

bjp alleges ceo releases the munugode counting results which are in favour of trs
  • రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో జాప్యం అంటూ బీజేపీ ఆరోపణ
  • టీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలు వెంటనే విడుదలవుతున్నాయన్న బండి సంజయ్
  • బీజేపీ ఆధిక్యం సాధించిన ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన
  • అన్ని రౌండ్ల ఫలితాలను వెనువెంటనే విడుదల చేయాలన్న కిషన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరుపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నేటి ఉదయం మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే... 11 గంటల సమయానికంతా 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులో ఆయా రౌండ్లలో వచ్చిన ఫలితాలను విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ దిశగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ఆధిక్యం కనబరచిన రౌండ్ల ఫలితాలను అప్పటికప్పుడే వెల్లడిస్తున్న అధికారులు... బీజేపీ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలను మాత్రం ఆలస్యంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. 

బీజేపీ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలను వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ జాప్యానికి గల కారణాన్ని సీఈఓ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితి చూస్తుంటే... సీఈఓ వైఖరి అనుమానాస్పదంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓపై ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడబోమని సంజయ్ అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ కు నేరుగా ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆయన వికాస్ రాజ్ ను నిలదీశారు. రౌండ్ల వారీగా ఎప్పటి ఫలితాలను అప్పుడే వెల్లడించాలన్నారు.
Telangana
Munugode
G. Kishan Reddy
BJP
Bandi Sanjay
TS CEO
Vikas Raj
Election Commission

More Telugu News