Munugode: అవకతవకలకు ఆస్కారం లేదు... జాప్యానికి కారణం ఇదే: సీఈఓ వికాస్ రాజ్

ts ceo vikas raj ruled out faults in munugode bypoll counting
  • ఆలస్యంగా సాగుతున్న మునుగోడు ఓట్ల లెక్కింపు
  • అభ్యర్థులు ఎక్కువ మంది కాబట్టే జాప్యం జరుగుతోందన్న వికాస్ రాజ్
  • ఇతర రాష్ట్రాల్లో ఐదుగురు, ఆరుగురే పోటీలో ఉన్నారని వెల్లడి
  • అధికారులతో పాటు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతోందన్న సీఈఓ
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వినిపిస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. ఎన్నికల సంఘం ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ కాసేపటి క్రితం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని ఆయన చెప్పారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేనన్న వికాస్ రాజ్... అందుకు కారణాలు కూడా ఉన్నాయన్నారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వికాస్ రాజ్ చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న కారణంగానే ఓట్ల లెక్కింపు అనుకున్న దాని కంటే ఆలస్యంగా జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతున్న వైనాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ఆయా రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఐదుగురు, ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారని ఆయన చెప్పారు. అందుకు విరుద్ధంగా మునుగోడులో ఏకంగా 47 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన తెలిపారు.

మరోవైపు ఓట్ల లెక్కింపు గుట్టుగా సాగడం లేదన్న వికాస్ రాజ్... రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు (అబ్జర్వర్)లతో పాటు ఆయా అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఆరోపణలను ప్రస్తావించగా... తన వద్దకు ఇప్పటిదాకా ఓట్ల లెక్కింపుపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని వికాస్ రాజ్ చెప్పారు. ఫిర్యాదు అందితే దానిని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Munugode
Telangana
TS CEO
Vikas Raj
Election Commission
Counting

More Telugu News