BJP: ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. హిమాచల్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ

BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power
  • ఈ నెల 12 హిమాచల్ అసెంబ్లీకి పోలింగ్
  • మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామంటున్న బీజేపీ
  • ఈసారి కాంగ్రెస్ తో పాటు ఆప్ నుంచి బీజేపీకి పోటీ
మరో వారం రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టో  అదివారం విడుదల చేసింది. హిమాచల్ లో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇది ముస్లింలలో వివాదాస్పద అంశం కానుంది. ఎందుకంటే బీజేపీ మళ్లీ అధికారం చేపడితే మత ప్రాతిపాదికన ముస్లింలకు లభించే కొన్ని చట్టాలు తొలగిపోయి, పలు హక్కులు ముస్లింలు కోల్పోతారు. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే గుజరాత్‌లో కూడా వాగ్దానం చేసిన ఈ హామీతో హిందువుల ఓట్లను ఆకర్షించే గిమ్మిక్కు అని ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీని విమర్శిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో వక్ఫ్ ఆస్తులపై సర్వేలు నిర్వహిస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాల్లో ఐదేళ్లలో 8 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న వాగ్దానం కూడా ఉంది. 

రాష్ట్రంలో ఎక్కువగా పండించే యాపిల్స్‌కు ప్యాకేజింగ్‌పై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 18 శాతం నుంచి 12కి తగ్గిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టో లో 6 నుంచి 12 తరగతుల బాలికలకు సైకిళ్లు, కళాశాల బాలికలకు స్కూటర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని అధికార పార్టీ వాగ్దానం చేసింది. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.  హిమాచల్ ప్రదేశ్ లో సాధారణంగా ప్రతి ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ ఉంటుంది. కానీ, ఈ సారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
BJP
Himachal Pradesh
elections
manifesto
Uniform Civil Code

More Telugu News