T20 World Cup: జింబాబ్వేతో మ్యాచ్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

team india wins the toss and elected to bat first
  • మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి జింబాబ్వేకు బౌలింగ్ అప్పగించిన రోహిత్
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ లో ఇంగ్లండ్ తో తలపడనున్న భారత్
  • ఓడితే సెమీస్ లో న్యూజిల్యాండ్ తో మ్యాచ్ ఆడనున్న టీమిండియా
టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో మరికాసేపట్లో టీమిండియా సూపర్ 12 లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను ఆడనుంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 1.30 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ లో జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే టీమిండియాకు సెమీస్ బెర్త్ ఖరారు కాగా... ఈ మ్యాచ్ ఫలితంతో సెమీస్ లో భారత జట్టు తలపడే జట్టు ఏదన్న విషయం తేలిపోనుంది. 

సాధారణంగా టీ20 మ్యాచ్ లలో టాస్ గెలిచే జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని ఛేజింగ్ కు ప్రాధాన్యమిస్తూ ఉంటాయి. టీమిండియా కూడా అదే ఫార్ములాను కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఇప్పటికే సెమీస్ లో బెర్త్ ఖరారు కావడం, ప్రత్యర్థి జట్టు పెద్దగా రాణించలేని స్థితిలో ఉండటంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం, ఓపెనర్ కేఎల్ రాహుల్ గత మ్యాచ్ లోనే బ్యాటుకు పదును పెట్టిన తీరుతో ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే... గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరే తొలి జట్టుగా నిలుస్తుంది. ఇదే జరిగితే... సెమీస్ లో గ్రూప్ 1లో సెమీస్ చేరిన రెండో జట్టు అయిన ఇంగ్లండ్ తో తలపడుతుంది. అలా కాకుండా జింబాబ్వే చేతిలో భారత్ ఓడితే... గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరిన తొలి జట్టు న్యూజిల్యాండ్ తో తలపడనుంది.
T20 World Cup
Team India
Zimbabwe
Australia
Melbourne Cricket Ground

More Telugu News