COVID19: కరోనా నుంచి కోలుకున్నాక.. వ్యాయామంపై జాగ్రత్త!
- ఒకేసారి కఠినమైన వ్యాయామం వద్దంటున్న నిపుణులు
- మళ్లీ మొదటి నుంచీ మొదలుపెట్టాలని సూచన
- క్రమపద్ధతిలో తీవ్రత పెంచాలని వైద్యుల సలహా
కరోనా బారిన పడి కోలుకున్నాక ఒకేసారి కఠిన వ్యాయామాల జోలికి వెళ్లొద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వైరస్ తో బాధపడిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కోలుకున్నాక కూడా కరోనా వైరస్ ప్రభావం చాలా కాలం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకముందు చేసిన కఠినమైన వ్యాయామాలను ఇప్పుడు వెంటనే చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
గతంలో మీరు మొట్టమొదటిసారి వ్యాయామం చేసినట్లే ఇప్పుడు కూడా తేలికపాటి వ్యాయామాలతో మొదలు పెట్టి క్రమంగా కఠినమైన వ్యాయామాలు చేయాలని వివరించారు. అదే సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే అలసటను గమనిస్తూ అవసరాన్ని బట్టి వ్యాయామానికి విరామం ఇవ్వాలని చెప్పారు. దీర్ఘకాలిక కరోనాతో బాధపడిన వాళ్లు మాత్రం వ్యాయామానికి దూరంగా ఉండడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్నాక తరచూ ఆయాసం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు వ్యాయామంతో చెక్ పెట్టొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు. అయితే, వైరస్ బారిన పడి కోలుకున్నాక వ్యాయామం చేసే విషయంలో జాగ్రత్తలు మాత్రం అవసరమని పేర్కొన్నారు.