TRS: పార్టీ పేరు మార్పుపై టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన
- జాతీయ పార్టీ గుర్తింపు ప్రక్రియలో భాగమేనని సమాచారం
- కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ప్రకటన
- పార్టీ చీఫ్ కేసీఆర్ పేరుతో స్థానిక పత్రికల్లో ప్రచురణ
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు టీఆర్ఎస్ సోమవారం బహిరంగ ప్రకటన జారీచేసింది. పార్టీ పేరు మార్పుపై అభ్యంతరం ఉంటే తెలపాలని ఈ ప్రకటనలో కోరింది. ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను, తగిన ఆధారాలను తెలపాలని సూచించింది. టీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) పేరుతో ఈ ప్రకటన వెలువడింది. జాతీయ పార్టీ గుర్తింపు ప్రక్రియలో భాగంగానే ఈ ప్రకటన విడుదల చేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పేరు మార్చుకునే సందర్భంలో వ్యక్తమయ్యే అభ్యంతరాలనూ పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికలలోనూ ప్రకటనలు ప్రచురించాలి. ఈ నిబంధన నేపథ్యంలోనే తాజాగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.