Andhra Pradesh: జగన్ మద్దతుతోనే రైతులు అమరావతికి ధైర్యంగా భూములు ఇచ్చారు: ఉండవల్లి అరుణ్ కుమార్
- రాజధాని అమరావతిపై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో రాజధానిపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
- నాడు అమరావతిలో రాజధాని అంటే తాను వ్యతిరేకించానని వెల్లడి
- ఇప్పుడు ఏం జరుగుతుందో సుప్రీంకోర్టులోనే తేలుతుందన్న మాజీ ఎంపీ
ఏపీ రాజధాని అమరావతిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు ఏపీ రాజధానిని అమరావతిలో కట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని ఉండవల్లి అన్నారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? లేదంటే మూడు రాజధానులు ఏర్పడతాయా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది సుప్రీంకోర్టులో తేలుతుందని ఆయన అన్నారు.
అమరావతిలో రాజధాని నిర్మాణం అంటే తనతో పాటు చాలా మంది వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉండవల్లి ప్రస్తావించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అంటే నాడు రైతులు కూడా ఒకింత వ్యతిరేకతతోనే ఉన్నారన్నారు. అయితే నాడు విపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు ఇచ్చారన్నారు. అమరావతికి జగన్ మద్దతు ఇవ్వడంతో అక్కడి రైతులు ధైర్యంగా తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారని ఉండవల్లి తెలిపారు.