Chandra Kanta Meghwal: పోలీసుల తీరుకు నిరసనగా వాటర్ ట్యాంకు ఎక్కిన మహిళా ఎమ్మెల్యే
- రాజస్థాన్ లో ఘటన
- ఓ పట్టణంలో దొంగల స్వైరవిహారం
- 15 రోజుల వ్యవధిలో 15కి పైగా చోరీలు
- బెంబేలెత్తిపోతున్న ప్రజలు
- పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం
పోలీసులపై అసంతృప్తితో ఓ బీజేపీ ఎమ్మెల్యే వాటర్ ట్యాంకు ఎక్కిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. బుండి జిల్లాలోని కేశోరాయ్ పటన్ నియోజకవర్గం నుంచి చంద్రకాంత మేఘ్వాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆమె నియోజకవర్గంలోని కప్రేన్ పట్టణంలో గత కొన్నివారాలుగా దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. అనేక ఇళ్లలో దొంగలు పడుతుండడంతో స్థానికులు హడలిపోతున్నారు.
15 రోజుల వ్యవధిలో 15కి పైగా చోరీలు జరిగాయి. రూ.30 లక్షల వరకు సొత్తు దొంగలపాలైంది. దొంగతనాలు పెరిగిపోతుండడంతో స్థానికులు ఎమ్మెల్యే చంద్రకాంత మేఘ్వాల్ తో మొరపెట్టుకున్నారు. దాంతో ఆమె పోలీసులపై మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వర్గాలకు విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకపోవడంతో ఎమ్మెల్యే చంద్రకాంత మేఘ్వాల్ నిరసన బాటపట్టారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆమె వాటర్ ట్యాంకు పైకి ఎక్కి ఆందోళన చేశారు. ఆమెతో పాటు బుండి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిట్టర్మల్, స్థానిక కౌన్సిలర్లు కూడా ట్యాంకు ఎక్కి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో జిల్లా అసిస్టెంట్ మేజిస్ట్రేట్, ఏఎస్పీ అక్కడికి వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.