Telangana: కేసీఆర్ ను నేను కలిసినట్లు మార్ఫింగ్ ఫొటో సృష్టించి నన్ను ఓడించారు: పాల్వాయి స్రవంతి

palvai sravanthi says she has defeated with marphed photo in munugode bypolls
  • సొంతూరిలో మీడియా సమావేశం నిర్వహించిన స్రవంతి
  • తాను కేసీఆర్ ను కలవలేదని వెల్లడి
  • బీజేపీ మాదిరే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కోవర్టు రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపణ
మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్గి 10 వేల ఒట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించిన సంగతి విదితమే. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై ఆదివారం మీడియాతో మాట్లాడని స్రవంతి... సోమవారం మాత్రం తన సొంతూరు చండూరు మండలం ఇడికుడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఓటమికి గల కారణాన్ని ఆమె మీడియా ముందు వివరించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు టీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ తప్పుడు అంశాలతో ప్రచారం సాగించాయని స్రవంతి ఆరోపించారు. తాను సీఎం కేసీఆర్ ను కలవకున్నా... ఆయనను కలిసినట్లు ఓ మార్ఫింగ్ ఫొటో సృష్టించి దానిని విరివిగా ప్రచారం చేశారన్నారు. ఈ మార్ఫింగ్ ఫొటో తన ఎన్నికల ప్రచారంపైనా, తనకు పడే ఓట్లపైనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఈ మార్పింగ్ ఫొటో కారణంగానే ఎన్నికల్లో తాను ఓడిపోయానని కూడా ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ఆమె ఆరోపించారు.

బీజేపీ కోవర్టు రాజకీయాలకు పాల్పడిందని స్రవంతి ఆరోపించారు. చివరకు ఓటర్లకు కల్తీ మద్యం పంపిణీ చేసి వారిని అనారోగ్యం బారిన పడేసిందని ఆరోపించారు. బీజేపీ మాదిరే చివరకు తమ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కోవర్టు రాజకీయాలే చేశారన్నారు. తనకు ద్రోహం చేసిన వెంకట్ రెడ్డిపై చర్యలు ఉంటాయో, లేదో పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్రవంతి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగలేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన విధిని ఈ ఎన్నికల్లో సక్రమంగా నిర్వర్తించలేకపోయిందన్నారు.
Telangana
Congress
Munugode
Palvai Sravanthi
Komatireddy Venkat Reddy
TRS
BJP

More Telugu News