AB de Villiers: టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరతాయి... ఇండియా కప్ గెలుస్తుంది: ఏబీ డివిలియర్స్
- ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
- ఈ నెల 9, 10 తేదీల్లో సెమీస్
- న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్
- భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- టీమిండియాలో అందరూ రాణిస్తున్నారన్న డివిలియర్స్
గత కొన్నివారాలుగా క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తున్న టీ20 వరల్డ్ కప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సెమీఫైనల్ పోటీలు జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనుండగా, రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి.
ఈ నేపథ్యంలో, టీమిండియా అవకాశాలపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ఈ మెగా టోర్నీలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ చేరతాయని భావిస్తున్నానని వెల్లడించాడు. చివరికి భారత్ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాలో ప్రతిభ పరవళ్లు తొక్కుతోందని, జట్టులోని అందరు ఆటగాళ్లు రాణిస్తున్నారని పేర్కొన్నాడు.
ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ తిరుగులేని ఫామ్ లో ఉన్నారని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ఇక, రోహిత్ అద్భుతమైన బ్యాట్స్ మన్ అని, అతడు కూడా ఫామ్ లోకి వస్తే టీమిండియాను ఆపడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ తో సెమీస్ పోరు ఆసక్తికరంగా సాగనుందని పేర్కొన్నాడు.