Perni Nani: బందరు పోర్టుపై టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారు: పేర్ని నాని
- టీడీపీ నేతలపై పేర్ని నాని విమర్శలు
- బందరు పోర్టుపై వాస్తవాలు తెలుసుకోవాలని హితవు
- శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణ
టీడీపీ నేతలపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ధ్వజమెత్తారు. బందరు పోర్టుపై టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు బందరు పోర్టును ఏ మేరకు నిర్మాణం చేశారో చెప్పాలని టీడీపీ నేతలను నిలదీశారు. ఓ శంకుస్థాపన రాయి వేస్తే పోర్టు నిర్మాణం చేసినట్టేనా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో టెండర్లు దక్కించుకున్న నవయుగ సంస్థ శంకుస్థాపన చేసి ఎనిమిది నెలలైనా పార మట్టి పని కూడా చేయలేదని పేర్ని నాని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టు వ్యాపారం తగ్గకుండా ఉండడం కోసం టీడీపీ చేసినట్టు, ఓ శంకుస్థాపన బండ పడేసి వదిలేయబోమని, పనులు చేపడతామని పేర్కొన్నారు.
బందరు పోర్టు విషయంలో వైసీపీని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, కొల్లు రవీంద్ర తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలని అన్నారు. బందరు పోర్టు నిర్మాణానికి అవసరానికి మించి భూములు తీసుకుని, ఊళ్లను ఖాళీ చేయించడాన్నే తాము అడ్డుకున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు.