Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం...రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్ల విడుదల
- రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటులో ఏపీ
- ఏపీ సహా 14 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు
- 14 రాష్ట్రాలకు రూ.7,183 కోట్లను విడుదల చేసిన కేంద్రం
- ఈ విడతతో ఏపీకి చేరిన రూ.7,032 కోట్ల రెవెన్యూ లోటు నిధులు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్రం ఏపీకి రూ.879 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఈ ఏడాది ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.7,032 కోట్లను కేంద్రం విడుదల చేసినట్టయింది.
దేశవ్యాప్తంగా రెవెన్యూ లోటుతో 14 రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. వాటిలో ఏపీతో పాటు అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ కోసం మంగళవారం కేంద్రం రూ.7,183 కోట్లను విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు రూ.1,132 కోట్లు విడుదలయ్యాయి.