Vande Bharat Express: మనకూ ఓ ‘వందేభారత్’.. కేటాయించిన రైల్వే బోర్డు
- వందేభారత్‌లో ఆరో దానిని తెలంగాణకు కేటాయించిన రైల్వే బోర్డు
- గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్న రైలు
- రూటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న అధికారులు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న వందేభారత్ రైళ్లలో ఒకటి సికింద్రాబాద్ నుంచి కూడా పరుగులు తీయనుంది. అత్యాధునిక సాంకేతికతతో, అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలును దక్షిణ మధ్య రైల్వేకు కేటాయిస్తున్నట్టు రైల్వే బోర్డు నుంచి ఇక్కడికి అధికారులకు సమాచారం అందింది.
వందేభారత్ రైళ్లలో బెర్తులు ఉండవు. సీటింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రయాణం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిసేలా దీని రూటును ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా మార్గాన్ని ఖరారు చేయలేదు. అయితే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, విశాఖపట్టణం, ముంబై మార్గాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ కూడా ఈ నగరాలకే ఎక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్లు తయారవుతున్నాయి. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ఇవి దూసుకెళ్లగలవు. ఇప్పటి వరకు నాలుగు రైళ్లు పట్టాలెక్కాయి. ఐదో దానిని మైసూరు- బెంగళూరు- చెన్నై మధ్య నడపనున్నారు. రేపటి నుంచే ఇది పట్టాలెక్కనుంది. ఆరోదానిని తెలంగాణకు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మధ్య దీనిని నడపాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి, లేదంటే విశాఖకు నడపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్, ప్రయాణికుల డిమాండ్ వంటివాటిపై రైల్వే బోర్డు అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. కాగా, దక్షిణమధ్య రైల్వేకు తొలి రైలును కేటాయించినట్టు తమకు సమాచారం అందిందని సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా తెలిపారు.