menopaus: మెనోపాజ్ దశలో మహిళలకు క్యాల్షియం చాలా అవసరమంటున్న వైద్యులు
- మెనోపాజ్ తో ఈస్ట్రోజెన్ తయారీ బంద్
- దీంతో ఎముకల సాంద్రతలో క్షీణత
- ఫ్రాక్చర్ల రిస్క్ ఎక్కువ
మహిళల్లో మెనోపాజ్ ఒక టర్నింగ్ పాయింట్ (మలుపు) వంటిది. వారి ఆరోగ్యంలో ఎన్నో మార్పులు మెనోపాజ్ తర్వాత నుంచి కనిపిస్తాయి. రుతుచక్రం ఆగిపోవడంతో హార్మోన్ల తయారీ నిలిచిపోతుంది. దీంతో కొందరు బరువు పెరిగిపోతారు. ఒత్తిడికి గురవుతుంటారు. జీవక్రియల్లో మార్పులతో మధుమేహం, బీపీ, గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. దీనికితోడు క్యాల్షియం లోపించి ఎముకలు పెళుసుబారిపోతాయి. ఫలితంగా ఫ్రాక్చర్ల బారిన పడుతుంటారు.
ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల గుండె, ఎముకల ఆరోగ్యంలో ఎంతో మార్పు వస్తుందని ఇండస్ హెల్త్ ప్లస్ హాస్పిటల్ జాయింట్ ఎండీ డాక్టర్ అమోల్ నైకవాడి పేర్కొన్నారు. మెనోజాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ బారిన పడతారని చెప్పారు. ఎముకలు బలహీన పడతాయని తెలిపారు. ఎముకలు పెద్ద ఎత్తున బలాన్ని కోల్పోవడంగా పేర్కొన్నారు. పైకి దీని లక్షణాలు కనిపించకుండానే ఈ నష్టం జరిగిపోతుంది. కనుక ఈ రిస్క్ తగ్గించుకునేందుకు డాక్టర్ అమోల్ సూచనలు ఇలా ఉన్నాయి.
క్యాల్షియం తీసుకోవాలి
క్యాల్షియం తగినంత శరీరానికి అందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈ క్యాల్షియంతో ఎముకలు బలంగా ఉంటాయి. పాల ఉత్పత్తులు, సాల్మన్ చేపలు, పాలకూర, బ్రొక్కోలీతో క్యాల్షియం తగినంత అందుతుంది. క్యాల్షియం గ్రహించేందుకు మెగ్నీషియం కూడా అవసరం. కనుక రోజుకో అరటి పండు తినొచ్చు.
వ్యాయామం
వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతో జాయింట్లపై శరీర బరువు భారం తగ్గుతుంది. టెన్నిస్, నడక, వేగవంతమైన నడక, నృత్యం ఎముకల బలాన్ని పెంచుతాయి.
విటమిన్ డీ
ప్రతి రోజూ శరీరానికి 20 నిమిషాల పాటు సూర్యుడి కిరణాలు తగిలేలా చూసుకుంటే కావాల్సినంత విటమిన్ డీని మన శరీరమే తయారు చేసుకుంటుంది. పాలు, గుడ్లు, చేపల ద్వారా కూడా కొద్ది పరిమాణంలో విటమిన్ డీ అందుతుంది. విడిగా వైద్యుల సూచనతో సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లను తీసుకోవద్దు. ఎందుకంటే విటమిన్ డీ ఎక్కువైతే మూత్రపిండాలు, ఎముకలకు నష్టం జరుగుతుంది.
ఔషధాలతోనూ సమస్య
ఎముకలకు కేవలం మెనోపాజ్ తోనే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలకు తీసుకునే చికిత్సలతోనూ నష్టం జరుగుతుంది. స్టెరాయిడ్స్ వాడకం, కొన్ని కరాల బ్రెస్ట్ కేన్సర్ చికిత్సలు, రక్తం పలుచగా ఉండేందుకు వాడే ఔషధాలతో నష్టం ఉంటుంది. కనుక ఈ తరహా చికిత్సలు తీసుకునే వారు ఓ సారి వైద్యులను సంప్రదించాలి.
ఈస్ట్రోజెన్ చికిత్స
ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండేందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ థెరపీ కూడా ఒకటి. మెనోపాజ్ కారణంగా కోల్పోయిన ఈస్ట్రోజన్ ను తిరిగి భర్తీ చేసుకోవచ్చు. మన శరీరం మరింత క్యాల్షియాన్ని సంగ్రహించుకునేందుకు ఈ హార్మోన్ సాయపడుతుంది. కాకపోతే అందరికీ కాదు, ఈ చికిత్సను మెనోపాజ్ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కొద్ది మందికే సూచిస్తున్నారు. ఈస్ట్రోజెన్ థెరపీతో కొన్ని దుష్ఫ్రభావాలు ఉండడమే దీనికి కారణం.