IPL 2023: తెలుగు క్రికెటర్లను వదిలేస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ
- కేఎస్ భరత్, అశ్విన్ హెబ్బర్ లను వేలంలోకి పంపాలని నిర్ణయం
- స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్, మరో ఇద్దరిని రిలీజ్ చేయనున్న ఢిల్లీ ఫ్రాంచైజీ
- ఐపీఎల్ ప్లేయర్ల రిటైన్షన్ కు ఈ నెల 15 వరకు తుది గడువు
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తెలుగు క్రికెటర్లు కోన శ్రీకర్ భరత్, అశ్విన్ హెబ్బర్ ను వదులుకునేందుకు సిద్ధమైంది. వీరితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లను ఫ్రాంచైజీ రిలీజ్ చేయనుంది. వచ్చే సీజన్ కోసం క్రికెటర్ల రిటెన్షన్‌కు తుది గడువు ఈనెల 25వ తేదీతో ముగియనుంది. ఆలోపు అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే క్రికెటర్లతో పాటు వేలంలోకి రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆంధ్ర వికెట్ కీపర్ కోన భరత్ తో పాటు ఓపెనర్ అశ్విన్ హెబ్బర్, శార్దూల్ ఠాకూర్, మన్‌దీప్ సింగ్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) ను వదిలేయాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.
గత ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్ల ధరతో పేసర్ శార్దూల్‌ను తీసుకుంది. అలాగే, బెంగళూరు నుంచి కేఎస్ భరత్ ను తీసుకుంది. జట్టులో రెగ్యులర్ కీపర్ గా కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా ఉండటంతో భరత్‌కు మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం లేదు. దీంతో అతడిని కూడా వేలంలోకి పంపాలని నిర్ణయించింది. ఏపీకే చెందిన అశ్విన్ హెబ్బర్‌కు గత సీజన్ లో మ్యాచ్ ఆడే చాన్సే రాలేదు. పంజాబ్ కు చెందిన ఓపెనర్ మన్‌దీప్ ఫామ్‌లో లేడు. దాంతో, వీళ్లను వదులుకోవాలని ఢిల్లీ నిర్ణయానికి వచ్చింది.