Nirav Modi: లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు!
- రూ. 13 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా నీరవ్ మోదీ
- నీరవ్‌ను దేశానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా నీరవ్ మోదీ
పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ. 13 వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం లండన్‌లోని వండర్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత దేశం నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి ఆయనను తిరిగి భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఆయనను భారత్‌కు అప్పగించేందుకు వీలుగా జిల్లా జడ్జి శామ్ గూజ్ వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పు నిచ్చింది.
ఈ పిటిషన్‌ను నీరవ్ హైకోర్టులో సవాలు చేశారు. తన మానసిక ఆరోగ్యాన్ని కారణంగా చూపిస్తూ దానిని కొట్టివేయాలని అభ్యర్థించారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. నీరవ్‌ను భారత్‌కు అప్పగించడం అన్యాయం, అణచివేత కాదని స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో నీరవ్‌ను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైనట్టే.
అయితే, తన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో నీరవ్ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన 14 రోజుల్లోపు ఆయన సుప్రీంలో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, అవసరమైతే ఆయన యూరోపియన్ మానవ హక్కుల కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.