sabarimala: 17 నుంచి శబరిమల యాత్ర .. పకడ్బందీ ఏర్పాట్లు

Aerial Vigil To Ensure Safe Sabarimala Pilgrimage
  • 14 వేల మంది పోలీసులతో భద్రత
  • 134 సీసీటీవీ కెమెరాలతో ఏర్పాట్లు
  • భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కేరళ పోలీస్ బాస్
  • ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా
శబరిమల యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి మొదలు కానున్న ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని వివరించారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులతో కలిసి భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. దారిపొడవునా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు పేర్కొన్నారు. ఈమేరకు కేరళ పోలీస్ బాస్ అనిల్ కాంత్ బుధవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

కరోనా ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు వచ్చే అవకాశం ఉందని అనిల్ కాంత్ చెప్పారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని తట్టుకునేలా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని విలేకరులకు తెలిపారు. సుమారు 14 వేల మంది పోలీసులు ఈ యాత్రలో భక్తులకు భద్రత కల్పిస్తారని చెప్పారు. మొత్తం 134 సీసీటీవీ కెమెరాలతో భక్తులను నిరంతరం గమనిస్తుంటామని పేర్కొన్నారు. ఏరియల్ సర్వే కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాల సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. సంఘ విద్రోహశక్తులను గుర్తించేందుకు పక్క రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలను కూడా శబరిమల యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో భాగం చేసినట్లు అనిల్ కాంత్ వివరించారు.

యాత్ర కోసం కేరళ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తోందని అనిల్ కాంత్ తెలిపారు. నీలక్కల్ వరకే ప్రైవేటు వాహనాలను అనుమతిస్తామని, అక్కడి నుంచి కేవలం ఆర్టీసీ బస్సులనే పంపా వరకు అనుమతిస్తామని చెప్పారు. ఇక, వర్చువల్ క్యూలైన్ ను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సంఘ విద్రోహులు యాత్రలో పాల్గొనకుండా అడ్డుకోవడం, భక్తుల ముసుగులో వచ్చే నేరస్థులను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిల్ పంత్ తెలిపారు.
sabarimala
piligrimage
kerala
police
security
pampa

More Telugu News