T20 World Cup: దంచి కొట్టిన పాండ్యా, కోహ్లీ... ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే..!
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసిన భారత్
- హాఫ్ సెంచరీలతో అలరించిన పాండ్యా, కోహ్లీ
- నిరాశపరచిన కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్
- 169 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లండ్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేటి రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు పడినా.. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ తమ బ్యాటును ఝుళిపించడంతో భారత్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. ఒకానొక దశలో కనీసం 150 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం కాగా... టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులతో జట్టు స్కోరు ఏకంగా 168 పరుగులు చేరింది.
కేవలం 32 బంతులను ఆడిన పాండ్యా... 3 ఫోర్లు, 5 సిక్స్ లతో 63 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి ఫోర్ కొట్టినా... తన కాలు వికెట్లకు తాకి హిట్ వికెట్ గా అతడు అవుట్ కావడంతో ఆ 4 పరుగులు కాస్తా అతడితో పాటు జట్టు ఖాతాలో కూడా చేరకుండా పోయాయి. కీలక వికెట్లు పడుతున్న సమయంలో అందిన బంతిని అందినట్లే బాదిన పాండ్యా జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.
ఇక టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా పరుగుల వరదను బాగానే అడ్డుకుంది. వరుసగా వికెట్లు తీసిన ఇంగ్లీష్ బౌలర్లు... పొదుపుగానూ బౌలింగ్ చేశారు. 2వ ఓవర్ లోనే కేఎల్ రాహుల్ (5)వికెట్ తీసిన ఇంగ్లండ్... 9వ ఓవర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (27) వికెట్ తీశారు. ఆపై 12వ ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ (14) వికెట్ నేలకూల్చారు.
ఇక పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన విరాట్ కోహ్లీ (50)ని 18వ ఓవర్ లో అవుట్ చేశారు. సరిగ్గా 50 పరుగులు పూర్తి చేసుకున్నాక కోహ్లీ అవుట్ కావడం గమనార్హం. అప్పటికే చెలరేగిపోతున్న పాండ్యా...కోహ్లీ అవుట్ అయిన తర్వాత 19వ ఓవర్ లో ఏకంగా 20 పరుగులు పిండాడు. ఇక 20వ ఓవర్ లో భారీ స్కోరుకు యత్నించిన పాండ్యా ప్లాన్ వర్కవుట్ కాకుండా ఇంగ్లండ్ అడ్డుకుంది.
టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే గెలిచి నిలవాల్సిన కీలక మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలమయ్యాడు. ఇక క్రీజులో కుదురుకున్నాడనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్వల్ప స్కోరుకే అవుట్ కావడం గమనార్హం. ఇక టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచ్ లలో వీర విహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ కీలకమైన మ్యాచ్ లో వికెట్ చేజార్చుకోవడం గమనార్హం.
అలాగే, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు పిండుకోడవంలో సిద్ధహస్తుడిగా పేరున్న దినేశ్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ (6) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన నేపథ్యంలో 169 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.