NVSS Prabhakar: కేసీఆర్ ఆఫీసులో వేలాది ఫైల్స్ పేరుకుపోయాయి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- మూడు నెలలుగా తెలంగాణలో పాలన స్తంభించిందన్న ప్రభాకర్
- ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపణ
- ధరణి పోర్టల్ పేరుతో భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శ
రాష్ట్రంలో గత మూడు నెలలుగా పాలన స్తంభించిపోయిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో వేలాది ఫైల్స్ పేరుకుపోయాయని అన్నారు. ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని... చివరకు గవర్నర్ తమిళిసై కూడా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని... ఇదే విషయాన్ని వారు ప్రైవేట్ గా కలిసినప్పుడు చెపుతున్నారని అన్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని చెప్పారు.
ధరణి పోర్టల్ పేరుతో భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. నయీం హత్య, డ్రగ్స్, ఈఎస్ఐ అవినీతి, మియాపూర్ భూముల కేసుల విచారణకు వేసిన సిట్ దర్యాప్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డుకోవడమంటే... అభివృద్ధిని అడ్డుకోవడమేనని చెప్పారు. నిజాం షుగర్, అజంజాహీ మిల్లును ఇంత వరకు ఎందుకు తెరిపించలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.