Rahul Dravid: సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఇప్పుడు స్పందిస్తే తొందరపాటు అవుతుంది: రాహుల్ ద్రావిడ్

Rahul Dravid opines on Team India semis lose

  • టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన టీమిండియా ప్రస్థానం
  • సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమి
  • నిరుత్సాహం కలిగించిందన్న ద్రావిడ్
  • లోపాలను సమీక్షించుకుంటామని వెల్లడి

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా ఒక ఘోర పరాజయంతో ముగించింది. నేడు ఇంగ్లండ్ తో అడిలైడ్ లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ పై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రస్థానం సెమీస్ తోనే ఆగిపోవడం నిరుత్సాహం కలిగించిందని అన్నాడు. 

"ఫైనల్స్ కు చేరుతామని భావించాం. కానీ ఇంగ్లండ్ అన్ని రంగాల్లో పైచేయి కనబర్చింది. ఇలాంటి ఓటమి తర్వాత ఆయా అంశాలపై స్పందించడం కష్టమైన విషయం. ఓవరాల్ గా చూస్తే సెమీస్ వరకు మా ఆటతీరు బాగానే ఉంది. సెమీస్ లో పిచ్ కాస్త స్లోగా ఉందని బ్యాట్స్ మెన్ చెప్పారు. ఏదేమైనా 180-185 పరుగులు చేసుంటే బాగుండేది" అని వివరించాడు. 

ఇక ఈ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకుని జట్టులో సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై స్పందిస్తే తొందరపాటు అవుతుందని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. సీనియర్ల కొనసాగింపుపై స్పందించేందుకు ఇది తగిన సమయం కాదని స్పష్టం చేశాడు. లోపాలను సమీక్షించుకుని వచ్చే వరల్డ్ కప్ కు జట్టును సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపాడు.

  • Loading...

More Telugu News