Taliban: మహిళా స్వేచ్ఛకు తాలిబన్ల సంకెళ్లు.. పార్కుల్లోకి ప్రవేశం నిషేధం

 Taliban ban women from Kabul parks

  • స్వేచ్ఛకు దూరంగా బతుకుతున్న ఆఫ్ఘన్ మహిళలు
  • నిషేధం విధించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించామన్న తాలిబన్ ప్రతినిధి
  • తాలిబన్ ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఐరాస

ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక అక్కడి మహిళలు స్వేచ్ఛకు దూరంగా బతుకుతున్నారు. వారిపై ఆంక్షలు విధించి ఇంటికే పరిమితం చేశారు. వారు బయటకు రావాలన్నా బోల్డన్ని ఆంక్షలు. ఈ నేపథ్యంలో వారికున్న మరో స్వేచ్ఛను కూడా తాలిబన్లు తాజాగా లాగేసుకున్నారు. జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. 

ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి మహ్మద్ అకేబ్ మొహజెర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలలుగా పార్కులు, జిమ్‌లలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్టు చెప్పారు. 

ఇందులో భాగంగా కొన్ని రోజులు మహిళలు, కొన్ని రోజులు పురుషులకు జిమ్‌లు, పార్కుల్లోకి ప్రవేశం కల్పించామని, అయినప్పటికీ తమ ఆదేశాలను ఎవరూ పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అంతేకాదు, చాలాచోట్ల పార్కుల్లో పురుషులు, మహిళలు కలిసి కనిపిస్తున్నారని అన్నారు. కొందరు మహిళలు హిజాబ్ కూడా ధరించడం లేదని అన్నారు. తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఖండించారు. మహిళలు, బాలికలకు అన్ని హక్కులు కల్పించి వారి స్వేచ్ఛను పునరుద్ధరించాలని కోరారు.

గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు మహిళలనే లక్ష్యంగా చేసుకున్నారు. బాలికలను విద్యకు దూరం చేశారు. మహిళా ఉద్యోగాలను పరిమితం చేశారు. మహిళలు బయటకు రావాలంటే వెంట పురుషుడు ఉండాల్సిందేనని, తల నుంచి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు జిమ్‌లు, పార్కుల్లోకి మహిళలకు ప్రవేశంపై నిషేధం విధించారు.

  • Loading...

More Telugu News