Janasena: జగనన్న ఇళ్లపై నేటి నుంచి జనసేన సోషల్ ఆడిట్.. రేపు విజయనగరం జిల్లాకు పవన్
- ప్రభుత్వ పథకాలపై సోషల్ ఆడిటింగ్ నిర్వహిస్తున్న జనసేన
- రేపు గుంకలాంలో జగనన్న కాలనీని పరిశీలించనున్న పవన్ కల్యాణ్
- ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లను ఎత్తిచూపడమే సోషల్ ఆడిటింగ్ లక్ష్యం
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పోరాటాన్ని ఉద్ధృతం చేయబోతోంది. పథకాలపై సోషల్ ఆడిటింగ్ నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్ ను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల కాలనీలు, టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను జనసేన నేతలు పరిశీలించనున్నారు.
ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ రేపు విజయనగరం జిల్లా గుంకలాంలోని అతి పెద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు. విజయనగరంతో పాటు రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. మరోవైపు ఇప్పటికే 'జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు' పేరుతో జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయి? పథకాల్లో లోటుపాట్లు ఏమిటి? పథకాల విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? తదితర అంశాలపై సోషల్ ఆడిట్ ద్వారా జనసేన సమాచారాన్ని సేకరించనుంది. లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.