salt intake: ఉప్పు తగ్గించుకోలేకపోతే.. ప్రత్యామ్నాయాలున్నాయ్!

Cut down your salt intake by including these healthy alternatives to flavour your foods

  • రోజులో 3 గ్రాములు ఆరోగ్యకరం
  • ఎక్కువైతే రక్తపోటు, గుండె జబ్బులు
  • మామిడి పౌడర్, మిరియాల పొడి, నిమ్మరసం
  • ఇవన్నీ మంచి రుచిని ఇచ్చేవే
  • వీటిని జోడించుకుని ఉప్పు తగ్గించుకోవచ్చు

మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల ఉప్పు తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 20 ఏళ్ల క్రితం అసలు ఉప్పు తగ్గించుకుని తినండన్న సూచన ఎక్కువగా వినిపించేది కాదు. కారణం అప్పట్లో యాంత్రిక జీవనం లేదు. ప్రతి ఒక్కరూ కష్టపడేవారు. నడిచి వెళ్లేవారు. స్వయంగా ఇంట్లో తమ పనులు తాము చేసుకునే వారు. దీంతో అదనపు సోడియంను శరీరం విసర్జించేది. కానీ, నేడు ఈ విధమైన శారీరక క్రియలు తగ్గిపోయాయి. దీంతో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి జీవనంలో ఉప్పు వల్ల వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి.

ఏ పదార్థానికి అయినా రుచిని ఇచ్చేది ఉప్పు. అలాంటప్పుడు ఉప్పు తగ్గించుకుని తినండని ఎలా చెబుతారు? అని అనుకుంటున్నారా..? నిజమే పదార్థానికి ఉప్పు రుచిని ఇస్తుంది. ఉప్పు ఇచ్చే రుచిని వేరే పదార్థాలతో భర్తీ చేసుకుంటే అప్పుడు అసలు ఉప్పుతో పని ఏముంటుంది? కనుక ఉప్పు రుచిని భర్తీ చేసే వాటి గురించి తెలుసుకుందాం.

ఆహారంలో సోడియం (ఉప్పు) అధికంగా ఉంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ కు దారితీస్తుంది. సోడియం పరిమాణం శరీరంలో పెరిగినప్పుడు, దీని కోసం శరీరం అధిక నీరును నిలిపి ఉంచుతుంది. ఎందుకంటే సోడియం, నీరు మధ్య ఒక నిష్పత్తిని కిడ్నీలు నిర్వహిస్తూ ఉంటాయి. సోడియం పెరిగినప్పుడు ఈ రేషియో మారిపోకుండా నీటిని కూడా అధికంగా ఉండేలా మూత్రపిండాలు నియంత్రిస్తాయి. ఇలా శరీరంలో అధికంగా నీరు చేరడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. 

సోడియం ప్రభావాన్ని తగ్గించేది పొటాషియం. కానీ, నేటి మన ఆహార అలవాట్లు సోడియాన్ని పెంచి, పొటాషియాన్ని తగ్గించే మాదిరి ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు రోజులో ఉప్పు 5 గ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి. రక్తపోటు, గుండె, మూత్ర పిండాల సమస్యలుంటే 3 గ్రాములు మించి తీసుకోకూడదు. సోడియం అధికంగా తీసుకుని, రోజులో పొటాషియం 3.5 గ్రాముల కంటే తక్కువగా తీసుకుంటే కనుక అప్పుడు రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. కనుక సోడియం తగ్గించడమే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి మార్గం.

నిమ్మరసం 
నిమ్మకు పులుపు గుణం ఉంటుంది. కనుక ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయం అవుతుంది. నిమ్మ రసమే కాదు, నిమ్మ తొక్కలో సహజ సిద్ధమైన సిట్రస్ నూనె ఉంటుంది. దీన్ని కూడా వంటల్లో వేసుకోవచ్చు. అసలు ఉప్పు వేయకుండా నిమ్మరసం యాడ్ చేసుకోవడం కాదు. ఉప్పు సగం తగ్గించేసి, కొంత నిమ్మరసం కలుపుకుంటే మంచి రుచి వస్తుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇదే దానికి అంత ఘాటునిస్తుంది. సోడియం పరిమాణాన్ని పెంచకుండా, ఆహారానికి వెల్లుల్లి మంచి రుచిని ఇస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలకు ఇది మంచి ఔషధంగానూ పనిచేస్తుంది. 

నల్ల మిరియాలు
మిరియాలు మంచి సువాసనను, రుచిని ఇస్తాయి. ఆహార పదార్థాల్లో మిరియాల పొడిని కొంచెం యాడ్ చేసుకుంటే మంచి రుచి తోడవుతుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను మిరియాలు తగ్గిస్తాయి. గుండె జబ్బులు, కేన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి.

మామిడి పొడుం
మామిడి కాయ ముక్కలను ఎండబెట్టుకుని, ఏడాది పొడవునా కూరల్లో వాడుకోవచ్చు. దీన్నే ఆమ్ చూర్ అని కూడా అంటారు. చట్నీలు, కూరలు, పప్పుల్లో వేసుకోవచ్చు. మంచి రుచిని ఇస్తుంది. దీనివల్ల ఉప్పు తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. ఒకవేళ ఉప్పు తగ్గించుకోలేని పరిస్థితుల్లో పొటాషియం ఉన్న ఆహార పదార్థాలను తప్పకుండా రోజూ తీసుకోవాలన్నది వైద్యుల సూచన.

  • Loading...

More Telugu News