Shahrukh Khan: ముంబై ఎయిర్ పోర్టులో షారుఖ్ ఖాన్ ను ఆపిన కస్టమ్స్ అధికారులు
- షార్జా నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఘటన
- రూ. 18 లక్షల విలువైన ఖరీదైన వాచ్ లను గుర్తించిన కస్టమ్స్ అధికారులు
- రూ. 6.83 లక్షల కస్టమ్స్ డ్యూటీ కట్టాలన్న అధికారులు
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కు ఊహించని అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆయనను కస్టమ్స్ అధికారులు ఆపేశారు. షార్జా లో ఓ ఈవెంట్ కు హాజరై ఒక ప్రైవేట్ జెట్ లో ముంబైకు షారుఖ్ తిరిగి వచ్చారు. టెర్మినల్ 3లో ఆ ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయింది. బయటకు వస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులు ఆయనతో పాటు, ఆయన వెంట వస్తున్న వారిని ఆపేశారు. షారుఖ్ తో పాటు, ఆయనతో వస్తున్న వారి బ్యాగుల్లో ఖరీదైన వాచ్ లు ఉన్న నేపథ్యంలో వారిని ఆపారు. రూ. 6.83 లక్షల కస్టమ్స్ డ్యూటీ కట్టి, ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లాలని వారిని అధికారులు అడిగినట్టు సమాచారం.
కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత షారుఖ్ ను, ఆయన మేనేజర్ ను ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోవడానికి అనుమతించారని... షారుఖ్ బాడీగార్డ్ తో పాటు మరికొందరిని రాత్రంతా ప్రశ్నించి, ఉదయం వదిలేసినట్టు సమాచారం. రూ. 18 లక్షల విలువైన 6 ఖరీదైన వాచ్ లను వీరు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు షారుఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయను గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డుతో సత్కరించారు.