Andhra Pradesh: ఈ నెలాఖరుతో సమీర్ శర్మ పదవీ కాలం పూర్తి...ఏపీ నూతన సీఎస్ గా శ్రీలక్ష్మి అంటూ ప్రచారం

ap officials rumoured that y srilakshmi is the new cs
  • తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు బదిలీ అయిన శ్రీలక్ష్మి
  • ముఖ్య కార్యదర్శి నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సీనియర్ ఐఏఎస్
  • అక్రమ గనుల కేసు నుంచి శ్రీలక్ష్మికి కలిగిన విముక్తి
  • ముగ్గురు సీనియర్లున్నా... శ్రీలక్ష్మికే అవకాశం అంటున్న అధికారులు
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సమీర్ శర్మ ఈ నెలాఖరుతో పదవీ విరమణ పొందనున్నారు. సమీర్ శర్మను మరింత కాలం పాటు సీఎస్ గా కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించి ఉంటే... ఇప్పటికే సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఉండేవారు. అయితే ఏపీ నుంచి కేంద్రానికి అలాంటి లేఖ ఏమీ వెళ్లలేదు. దీంతో సమీర్ శర్మ ఈ నెలాఖరుతో పదవీ విరమణ పొందక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

సమీర్ శర్మ పదవీ విరమణ పొందితే... ఆయన స్థానంలో నూతన సీఎస్ గా పదవి దక్కించుకునే వారు ఎవరు? అన్న దిశగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారికి సీఎస్ గా పదవి ఇచ్చే సంప్రదాయం ఉన్నా...  పలు కారణాలతో ఈ సంప్రదాయాన్ని చాలా కాలం క్రితమే ఆయా ప్రభుత్వాలు పక్కనపెట్టేశాయి. తమకు ఇష్టమైన అధికారిని సీఎస్ గా ఎంచుకునే కొత్త సంప్రదాయం ఎప్పుడో మొదలైపోయింది.

ఈ క్రమంలో ఏపీకి నూతన సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి ఎంపికయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలక్ష్మి కంటే సీనియర్లుగా నీరబ్ కుమార్ ప్రసాద్ (1987 బ్యాచ్)తో పాటు 1988 బ్యాచ్ కు చెందిన పూనం మాలకొండయ్య, గిరిధర్ లు ఉన్నారు. వీరిలో గిరిధర్ ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉండటంతో ఆయన ఏపీకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. అదే సమయంలో ఇటీవల పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ పూనం మాలకొండయ్యపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక నీరబ్ కుమార్ ప్రసాద్ పై వ్యతిరేకతేమీ లేకున్నా... ఆయన వైపు జగన్ దృష్టి సారించే అవకాశాలేమీ లేవని తెలుస్తోంది.

ఇక పూనం, గిరిధర్ ల బ్యాచ్ కే చెందిన శ్రీలక్ష్మి... జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారిణిగా పేరు పడ్డారు. గాలి జనార్దన్ రెడ్డికి సహకరించారనే ఆరోపణలతో విధుల నుంచి సస్పెండ్ అయిన శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటిదాకా తెలంగాణ కేడర్ ఐఏఎస్ గా ఉన్న శ్రీలక్ష్మి... ఏపీ కేడర్ కు మారేందుకు సిద్ధపడ్డారు. శ్రీలక్ష్మి కోసం జగన్ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు లేఖలు రాయడంతో పాటు తన ఢిల్లీ పర్యటనల్లో ఆయన శ్రీలక్ష్మి అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించారు.

 మొత్తానికి శ్రీలక్ష్మిని కేంద్రం ఏపీ కేడర్ కు మార్చగానే.. ఆమెకు జగన్ కీలకమైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్పగించారు. నెలల వ్యవధిలోనే ముఖ్య కార్యదర్శి నుంచి ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పించారు. అదే సమయంలో సీఎస్ గా శ్రీలక్ష్మి పదవి దక్కించుకునేందుకు అడ్డంకిగా ఉన్న అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు ఇటీవలే తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే... సమీర్ శర్మ తర్వాత శ్రీలక్ష్మికే సీఎస్ గా అవకాశాలు ఉన్నాయన్న దిశగా అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Andhra Pradesh
YSRCP
YS Jagan
AP CS
Sameer Sharma
Y.Srilakshmi

More Telugu News