Gujarat: గుజరాత్ లో బీజేపీ రథాన్ని లాగిన కాంగ్రెస్ ప్రచార రథం
- రెండు పార్టీల బంధాన్ని చాటే సన్నివేశమని ఆప్ వ్యాఖ్య
- గుజరాత్ లో ఊపందుకున్న ప్రచారం
- వీధివీధినా పార్టీల ప్రచార రథాలే
- అధికారంలోకి రావడానికి ఆప్.. నిలబెట్టుకోవడానికి బీజేపీ కృషి
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ లో పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది. చిన్నా పెద్దా పార్టీలన్నీ ప్రత్యేకంగా వాహనాలను డిజైన్ చేసి రోడ్లమీద, వీధుల్లో తిప్పుతున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీజేపీ రథం(మినీ ఆటో) ఒకటి ఇసుకలో కూరుకుపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బయటకు రావట్లేదు. ఇంతలో అటువైపు వచ్చిన కాంగ్రెస్ ప్రచార రథం దీనికి సాయం చేసింది. తాళ్లతో కట్టి బీజేపీ ప్రచార రథాన్ని బయటకు లాగింది. ఇదంతా అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బీజేపీ రథాన్ని లాగుతున్న కాంగ్రెస్ రథం అంటూ వ్యాఖ్యానించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్ లో ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనను ఈ వీడియో చక్కగా ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. గుజరాత్ లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శలు గుప్పించారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను రీట్వీట్ చేస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా వివరించే వీడియో అని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య ప్రేమ బంధం ఉందంటూ ‘సౌదాఘర్’ సినిమా డైలాగ్ ను కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. కాగా, గుజరాత్ లో అధికారంలోకి రావడానికి ఆప్ పట్టుదలగా ప్రయత్నిస్తుండగా.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ గట్టిగా కృషి చేస్తోంది.