Atchannaidu: ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

Atchannaidu fires after culprits tied Chappals to NTR statue
  • గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం
  • ఉప్పలపాడులో విగ్రహానికి చెప్పులు కట్టిన దుండగులు
  • ప్రభుత్వ వైఖరి వల్లే ఇలా జరుగుతోందన్న అచ్చెన్న
  • పునరావృతమైతే తమ స్పందన మరోలా ఉంటుందని హెచ్చరిక
గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన నీచులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ కు ఎన్నో అవమానాలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఎన్టీఆర్ కు తరచూ అవమానం జరుగుతోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

"ఎన్టీఆర్ విగ్రహాలకు గతంలో వైసీపీ నేతలు నిప్పుపెట్టడంతో పాటు పట్టపగలే దాడి చేశారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఆనాడే కఠినంగా శిక్షించి ఉంటే నేడు ఈ అవమానం జరిగేది కాదు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి పెద్ద అవమానమే చేస్తే... దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగితే మా స్పందన మరోలా ఉంటుంది. ప్రభుత్వానికి ఎన్టీఆర్ పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి" అంటూ అచ్చెన్న ఘాటుగా స్పందించారు.
Atchannaidu
NTR
Chappals
Uppalapadu
Guntur District
TDP
Andhra Pradesh

More Telugu News