Pakistan: చచ్చీచెడీ 137 పరుగులు చేసిన పాక్ బ్యాట్స్ మెన్... ఇంగ్లండ్ ముందు ఈజీ టార్గెట్
- మెల్బోర్న్ లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జోస్ బట్లర్
- విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లు
- విలవిల్లాడిన పాక్ బ్యాట్స్ మెన్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారీ స్కోరు సాధించాలన్న పాకిస్థాన్ జట్టు ఆశలకు ఇంగ్లండ్ బౌలర్లు కళ్లెం వేశారు. కీలక మ్యాచ్ లో దారుణంగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బౌలింగ్ దాడులను ఏ దశలోనూ సమర్థంగా ఎదుర్కొన్నట్టు కనిపించని పాక్... క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాన్ మసూద్ (38), కెప్టెన్ బాబర్ అజాబ్ (32), షాదాబ్ ఖాన్ (20) ఓ మోస్తరుగా ఆడగా, మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ జోస్ బట్లర్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ మెల్బోర్న్ పిచ్ పై ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. శామ్ కరన్ 3, అదిల్ రషీద్ 2, క్రిస్ జోర్డాన్ 2, బెన్ స్టోక్స్ 1 వికెట్ తీశారు.
ఇంగ్లండ్ జట్టు ఉన్న ఫామ్ చూస్తే పాక్ నిర్దేశించిన టార్గెట్ ఏమాత్రం సరిపోదనిపిస్తోంది. అయితే, పాక్ బౌలింగ్ ను తక్కువగా అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షాలతో కూడిన ప్రపంచస్థాయి పేస్ బౌలింగ్ దళం పాక్ జట్టు సొంతం. మరి స్వల్ప టార్గెట్ ను పాక్ ఎలా కాపాడుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.