Sharmila: వైఎస్ ను అవమానిస్తే చెప్పులతో కొడతాం: షర్మిల
- వైఎస్ ను అభిమానించే వాళ్లు కోట్ల మంది ఉన్నారన్న షర్మిల
- తెలంగాణ ప్రజల కోసమే తన పాదయాత్ర అని వ్యాఖ్య
- తనపై బాంబులు వేసినా బెదరనన్న షర్మిల
తన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలను టీఆర్ఎస్ శ్రేణులు చింపేయడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ ఫ్లెక్సీలను చింపే టీఆర్ఎస్ నేతలను రాళ్లతో తరుముతామని, చెప్పులతో కొడతామని హెచ్చరించారు. వైఎస్ ను అభిమానించే వాళ్లు, ఆయన పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు కోట్లలో ఉన్నారని చెప్పారు. చాలా మంది వారి ఇళ్లలో దేవుళ్ల ఫొటోల పక్కన వైఎస్ ఫొటో పెట్టుకున్నారని తెలిపారు.
కుటుంబానికి దూరంగా, పిల్లలకు దూరంగా ఉంటూ పాదయాత్ర చేస్తున్నానని... ప్రజల కోసమే పాదయాత్ర అని షర్మిల చెప్పారు. టీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు రాజశేఖరరెడ్డి బిడ్డ భయపడదని.. వెనకడుగు వేయదని అన్నారు. తన మీద రాళ్లు, చెప్పులు, బాంబుల్లో ఏది వేసినా బెదరనని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం, వైఎస్ పాలనను మళ్లీ తీసుకురావడానికి తాను వచ్చానని అన్నారు.
తమ ఫ్లెక్సీలను చించడం, తమ యాత్రకు అడ్డు తగలడం వంటివి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల పక్షాన పోలీసులు నిలబడటం లేదని అన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు ఖాకీ దుస్తులు వదిలి గులాబీ దుస్తులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారని.. ఈ రాష్ట్రానికి ఏం చేశారని ఇక్కడ కమలం వికసిస్తుందని ప్రశ్నించారు. కరీంనగర్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.