Minister botsa: నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా?.. పవన్ కల్యాణ్ పై మండిపడ్డ మంత్రి బొత్స
- జగనన్న కాలనీల నిర్మాణంలో అవినీతి ఎక్కడుందన్న మంత్రి
- ఆరోపణలు కాదు.. ఆధారాలతో బయటపెట్టాలని పవన్ కు ఛాలెంజ్
- జనసేన చీఫ్ పై ప్రధానికి ఫిర్యాదు చేయడానికి ఏముందని ప్రశ్న
- రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నామని వివరణ
పవన్ కల్యాణ్ మీద ప్రధానికి ఫిర్యాదు చేయడానికి ఏముందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ప్రశ్నించారు. ఆయన ఏం ఉద్ధరించారని, ఏం సాధిస్తారని తాము కంప్లయింట్ చేస్తామని అడిగారు. ఆయనేమన్నా యుగపురుషుడా? అని మండిపడ్డారు.
అసలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలాగని మంత్రి ప్రశ్నించారు. పవన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఈమేరకు విజయనగరంలో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందంటూ జనసేన చీఫ్ చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాడేపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు.
జగనన్న కాలనీల నిర్మాణంలో పదివేల కోట్లు, పదిహేను వేల కోట్ల అవనీతి జరిగిందంటూ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం బాధ్యత అనిపించుకోదని పవన్ కల్యాణ్ కు హితవు పలికారు. అవినీతి జరిగి ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తన మిత్రుడు, టీడీపీ చీఫ్ చంద్రబాబును పైకి లేపాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అయితే, పవన్ ఎన్ని జాకీలు పెట్టి లేపాలని చూసినా చంద్రబాబు లేవడని బొత్స వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు.
రాష్ట్రంలో ఇళ్లులేని 30 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన పవన్ కు కానీ, ఆయన స్నేహితుడు చంద్రబాబుకు గానీ ఎప్పుడైనా వచ్చిందా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తోందని, దీనికోసం ఇప్పటి వరకు సుమారు 7,700 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రంలోని ఏ లబ్దిదారు దగ్గరికైనా వెళ్లి నిజానిజాలు విచారించుకోవచ్చని పవన్ కల్యాణ్ కు బొత్స ఛాలెంజ్ విసిరారు.