Pawan Kalyan: ఈ కవితా పంక్తులు ప్రధాని మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయి: పవన్ కల్యాణ్
- గుంటూరు శేషేంద్ర కవితను ప్రస్తావించిన పవన్
- మోదీ క్లిష్ట సమయంలో పాలన చేపట్టారని వెల్లడి
- భారతీయులం అనే భావన నింపారని కితాబు
- ఉక్కు సంకల్పం ఉన్న నేత అంటూ కొనియాడిన వైనం
ప్రధాని నరేంద్ర మోదీపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. "ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద... అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ" అంటూ శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయని పేర్కొన్నారు.
మోదీ క్లిష్ట సమయంలో పాలన చేపట్టి, ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు అన్నింటిని అర్థం చేసుకుని, సమాదరించి, ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారని కొనియాడారు.
ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు నిరంతరం తపించారని వివరించారు. ప్రతి కఠిన పరిస్థితిని ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ అని పవన్ కల్యాణ్ కీర్తించారు.
ఇటీవల ప్రధాని మోదీని కలిశానని, ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో భేటీ కావడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పవన్ వెల్లడించారు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు తన ట్వీట్ లో వివరించారు.