Andhra Pradesh: ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలి ఉంది: నారా లోకేశ్
- ఆక్వా రైతుల కష్టాలపై నారా లోకేశ్ వరుస ట్వీట్లు
- ఆక్వా రైతులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శ
- మొద్దు నిద్ర వీడి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్
ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనా తీరుపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు సంధించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లను సంధించారు. మొన్న పవర్ హాలిడే అన్న జగన్ సర్కారు...నిన్న క్రాప్ హాలిడే అందని... ఇఫ్పుడేమో ఆక్వా హాలిడే అంటోందని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలి ఉందని ఆయన అన్నారు. ఆక్వా రంగాన్ని ఉద్ధరిస్తానని నమ్మించి ఆక్వా రైతులను జగన్ మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిందని లోకేశ్ అన్నారు.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు, దాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులతో ఆక్వా రైతులు కుదేలయ్యారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తికి రూ.270 ఖర్చవుతుంటే.. కనీసం రూ.200 కూడా రాక రైతులు ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నారన్నారు. కొత్త చట్టాల పేరుతో ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్వాహకులను వేధిస్తూ వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జోన్ తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికి యూనిట్ విద్యుత్ ని రూ.1.50 కే అందించాలని ఆయన కోరారు.