Super Star Krishna: కృష్ణ-ఎన్టీఆర్ మధ్య విభేదాలు.. మళ్లీ ఒక్కటి చేసిన ‘తెలుగు వీర లేవరా’!

NTR Predicted Krishna Cowboy Movie will be hit

  • మోసగాళ్లకు మోసగాడు సినిమా హిట్ అవుతుందని చెప్పిన ఎన్టీఆర్
  • కృష్ణ కోరిక మేరకు ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ 
  • అల్లూరి సీతారామరాజు సినిమా ప్రకటనతో కృష్ణతో ఎన్టీఆర్‌కు విభేదాలు
  • కృష్ణ రాజకీయాలకు దూరమయ్యాక మళ్లీ ఒక్కటైన దిగ్గజాలు

సూపర్ స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన తొలి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ ప్రివ్యూ చూసిన అందరూ పెదవి విరిచారు. సినిమా ఆడడం కష్టమేనని చెప్పేశారు. అయితే, ప్రివ్యూ చూసిన ఎన్టీఆర్ మాత్రం సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. 

ఆ తర్వాత కృష్ణ నిర్మించిన ‘పండంటి కాపురం’ సినిమా రజతోత్సవ వేడుకను విజయవాడలో నిర్వహిస్తే దానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయాలని ఉందన్న కోరికను బయటపెట్టారు. దానికి ఎన్టీఆర్ ఓకే చెప్పడం.. ఆ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’ రావడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రకటించారు. 

అయితే, కృష్ణ చేసిన ఈ ప్రకటన ఎన్టీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘దేవుడు చేసిన మనుషులు’ వంద రోజుల వేడుకకు ఎన్టీఆర్ దూరమయ్యారు. ఆ తర్వాత ‘దానవీరశూర కర్ణ’ సినిమా సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అప్పట్లో ఎన్టీఆర్‌కు అక్కినేని నాగేశ్వరరావు అండగా నిలిస్తే.. కృష్ణకు శోభన్‌బాబు, కృష్ణంరాజు మద్దతుగా నిలిచారు. ఆరు నెలలపాటు వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ఎన్టీఆర్ విజయం సాధించినట్టు చెబుతారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు వారి మధ్య మాటలు లేవు. 

చివరికి అనూహ్యంగా ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీఆర్‌కు కృష్ణ మద్దతు ప్రకటించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ కావడంతో కృష్ణ సినిమాల్లో బిజీ అయిపోయారు. మరోవైపు, ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కృష్ణ సరైనవాడు అని తలపోసిన కాంగ్రెస్ పార్టీ ఆయనను తమ పార్టీలో చేర్చుకుంది. రాజీవ్ గాంధీ మరణానంతరం రాజకీయాలకు కృష్ణ దూరమయ్యారు. 

అంతకుముందు పార్టీ పెద్దల ఆదేశాలతో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు చేశారు. కృష్ణ తన 300వ సినిమా అయిన ‘తెలుగు వీర లేవరా’ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను ఆహ్వానించారు. ఆ తర్వాతి నుంచి వారి మధ్య విభేదాల మాటే లేకుండా పోయింది. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన పేరిట ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును కృష్ణ అందుకున్నారు.

  • Loading...

More Telugu News